Wednesday, May 7, 2014

అలనాటి రేడియో నాటికలు

అసలు విజయవాడ అంటేనే ఇది “మనవాడ” అని ఆ ప్రాంతంతో అనుబంధం ఉన్నావారికి అనిపిస్తుంది. అక్కడ పుట్టిపెరిగిన వారికి మరొక అనుబంధం ఆకాశవాణి. వారి ప్రసారాలు కాలప్రవాహంలో లీలగా వెంటాడుతూనే ఉంటాయి. ఆ రోజుల్లో ఏ కొద్దిమందికో మాత్రమే రేడియో ప్రసారాలు రికార్డు చేసుకొనే అవకాశం ఉండేది. ఉన్నా ముందుచూపుతో భద్రపరచిన వాళ్ళు చాలా తక్కువ. ముందు ముందు సాంకేతిక పరిజ్ఞానం అబివృద్దిచెందుతుందని ఊహించని రోజులవి. ఈ రోజుల్లో మనమే నిత్యం ఎన్నో విని, చూచి, చదివి పారేస్తుంటాం. కానీ వాటిల్లో కొన్ని అయినా భద్రపరిస్తే, కొన్ని సంవత్సరాల తరువాత వాటిని చూసుకుంటుంటే కలిగే ఆనందం వేరు. 


 వెనుకటికి “అన్నీ వేదాల్లోన్నే ఉన్నాయష” అని కన్యాశుల్కంలో గురజాడవారు పలికించారు. ఈ కాలంలో అన్నీ అంతర్జాలంలోనే ఉన్నాయి అనుకోవటంలో తప్పులేదు. కానీ ఉన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. తెలుగు బ్లాగులు వీక్షించేవాళ్ళల్లో శ్రీ శివరామప్రసాద్ గారి బ్లాగు సాహిత్య - అభిమాని ఎరగని వాళ్ళు ఉండకపోవచ్చు. అనేక బ్లాగుల్లో వీరి రూపం దర్శనమిస్తూనేవుంటుంది. పేరుకి సాహిత్యాభిమానిగా అగుపిస్తున్నా వారు సంగీతాభిమాని కూడా అని వారి బ్లాగు చూస్తే అర్ధం అవుతుంది. వారు ఆ రోజుల్లో క్యాసెట్ల మీద రికార్డు చేసుకున్న విజయవాడ కేంద్రం వారి హాస్య నాటికలు mp3లోకిమార్చి ముందుతరాల వారికోసం అంతర్జాలంలో భద్రపరిచారు. ఇది చిన్న విషయం అనిపించవచ్చు కానీ ఆ నాటికలు వింటుంటే మనం గూడా ఇలా చేసివెంటే బావుండేదిగదా అనిపిస్తుంది.

 హాస్యనాటికలు అంటేనే గుర్తుకు వచ్చేది నండూరి సుబ్బారావు గారు, పుచ్చా పూర్ణానందం గారు, నాగరత్నమ్మ గారు, సీతారత్నం గారు. ఈ నాటకాల్లో రత్నంగార్ల సణుగుళ్లు, సుబ్బారావు గారి గొణుగుళ్లు, వీళ్ళ ఎకసెక్కాలు చాలా సరదాగా ఉంటాయి.

 తాళం చెవులు, దొందూ – దొందే , మా ఆవిడతో పెళ్ళికి, పూటకూళ్ళు, బామ్మగారి రేడియో అనే అయిదు నాటికలు శివరామప్రసాద్ గారు రికార్డు చేసి భద్రపరిచారు. నలుగురి దృష్టికి ఈ నాటికలు తేవాలన్న ఉద్దేశంతో ఇక్కడ పోస్ట్ చెయ్యటం జరిగింది. ఈ కింది లింకు ద్వారా వాటి వివరాలు చదివి, విని ఆనందించండి. 


అక్కడే చివర్లో కృష్ణా పుష్కరాల మీద ఒక రూపకం కూడా ఉన్నది. 1980 పుష్కరాల నాటికి విజయవాడ రూపురేఖలు మారిపోయాయి. కాలవల గట్లమీద ఉండే పాకలు గుర్తుండే వుంటాయి.  వాటినన్ని తొలగించి ఊరి చివరకు మార్చి నగరానికి శోభ కలిగించారు. బహుశ శ్రీ ఏ. వి. ఎస్. రెడ్డి గారు అప్పుడు జిల్లా కలెక్టర్ గా ఉన్నారనుకుంటాను.


ఆకాశవాణి వారి రూపకాలు చాలా బావుంటాయి. కొన్ని రూపకాల్లో తెలియకుండానే మనం కూడా అంతర్లీనంగా ప్రవహిస్తున్న అనుభూతి కలుగుతుంది. మరి విజయవాడ అన్నాక విశ్వనాధ వారు గుర్తుకురాకుండా ఉంటారా. ఆ రూపకం విన్నాక అందులో వినవచ్చే విశ్వనాధ వారి పద్యాన్ని, కృష్ణవేణీ నదీమతల్లి పుష్కర వివరాలను సాహిత్యరూపంలో కూడా ఒకమాటు చూడండి.










Tags: Krishna pushkaram, radio natikalu, akashavani, vijayawada




1 comment:

  1. నేను ఆర్ఖైవ్స్ లోకి అప్లోడ్ చేసిన రేడియో నాటికల గురించి వ్రాసినందుకు, ధన్యవాదాలు రమణ గారూ. చిత్రం ఏమంటే, అప్పట్లో ఎన్నో నాటికలను ఎందరో రికార్డ్ చేసుకుని ఉంటారు. వాటిని అందరితో పంచుకునే మనస్సే లేకపోతున్నది . అప్పటి రేడియో కళాకారులందరి దగ్గరా కూడా ఈ నాటికలు ఉండే ఉంటాయి. ఆకాశవాణి వారు, అప్పటి రోజుల్లో (ఇప్పటికీ అంతేనేమో) టేపులు ఆదా చెయ్యటానికి ఒక నాటిక ప్రసారం అవ్వగానే, ఎవరో ఒక గుమాస్తా దగ్గర అనుమతి తీసుకుని, ఆ టేపు చెరిపేసి మరొక కార్యక్రమం రికార్డ్ చేసేవారుట. ఆ గుమాస్తా బుధ్ధి ప్రకారం ఆ కార్యక్రమం ఆర్ఖైవ్స్ లో ఉంచాలా లేదా అన్న విషయం ఆధారపడి ఉంటుంది. అలాంటి నిర్ణయాధికారం, గుమాస్తాలకి ఇవ్వటమేమిటో విడ్డూరం. గుమాస్తా అంటే కళకారుడు కాని మిగిలిన అందరినీ కలగట్టి అంటున్నాను ఆ మాట.ఆ విధంగా గుమాస్తాల చేతుల్లో పడి అపురూపమైన నాటికలు, జస్ట్ టేపులు ఆదా చెయ్యటమనే మూర్ఖపు ఆలోచనతో, ఆకాశవాణి కళాకారులు తయారుచేసిన నాటికలే కాదు, ఎన్నెన్నో ఇంటర్వ్యూలు, పాటలు, ఇంకెన్నో అపురూప కార్యక్రమాలు గుర్తు లేకుండా పొయ్యాయి. ఈ మధ్య అదే ఆకాశవాణి గుమాస్తాలు, రోడ్డునపడి, పేపరు ప్రకటనలు ఇస్తున్నారు, శ్రోతల్లారా, మీదగ్గర అప్పటి రికార్డింగులు ఉంటే ఇవ్వండి మేము డిజిటైజ్ చేసి దాస్తాము అని. వాళ్ళు చేసేదేమిటి, సాంకేతికత ఈ రోజున నా లాంటి సామాన్యుడుకి కూడా అలాంటి అవకాశం ఇచ్చింది అని, నేను నా దగ్గర ఉన్నవి ఇలా ఆర్ఖైవ్స్ లోకి అప్లోడ్ చేశాను. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా అప్లోడ్ చేస్తాను.

    ఆకాశవాణి వారి తీరు గురించి నాకు కలిగిన బాధ, "ఆకాశవాణికి బహిరంగ లేఖ" అని నా బ్లాగులో చాలా కాలం క్రితం ప్రచురించాను. మీకు వీలునుబట్టి ఈ కింది లింకు నొక్కి చదవండి:

    http://saahitya-abhimaani.blogspot.in/2010/10/blog-post_03.html

    రేడియో కళాకారులకి రావలిసిన పేరు ప్రతిష్టలు రాలేదు, వాళ్ళ గురించి వ్రాసేవాళ్ళు (మీ లాంటి అతి కొద్ది మంది తప్ప) ఎవ్వరూ లేరు. ఇప్పటికీ అలనాటి రేడియో కళాకారులు కొందరు వ్రాస్తూనే ఉన్నారు. వాళ్ళు కూడా పూర్వపు తమ మితృలు, తోటి సహోద్యోగుల గురించి వ్రాస్తారేమో అని చూస్తుంటాను. ఎక్కడా అలాంటి ప్రయత్నమే లేదు. ఏదో తూతూ మంత్రంగా, కళ్ళతుడుపుగా వ్రాయటమే కాని, సంగ్రహంగా వ్రాసిన వాళ్ళు కాని, అలాంటి ప్రయత్నం చేసిన వాళ్ళు కాని ఉన్నట్టుగా కనపడదు.
    జ్ఞాపకాల పేరిట స్వోత్కర్ష తప్ప మరొకటి కనపడటం లేదు. ప్రముఖ సినీ నటుడు గొల్లపూడి మారుతీ రావుగారు అప్రతిహతంగా సంవత్సరాలబట్టి కౌముదిలో ఎన్నెన్నో వ్యాసాలు వ్రాసి రికార్డు కూడా చేస్తునారు. ఆయనకు చాలా మంది రేడియో కళాకారులు తెలుసు. మారుతీ రావు గారు చాలా రోజులు ఆకాశవాణిలో "అధికారి" గా పని చేస్తూ సినిమాల్లోకి వచ్చారు. ఆయన పూనుకుని అలనాటి కళాకారుల గురించి వ్రాయటం మొదలుపెడితే ఎంతో బాగుండును.

    ReplyDelete